: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై 420 కేసు నమోదు
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిపై రంగారెడ్డి జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో పరిగి పోలీసులు ఆయనపై సెక్షన్ 420 సహా 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించారు. విచారణలో రామ్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో కోర్టును ఆశ్రయించిన ఎన్నికల కమిషన్ హరీశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ సమర్పించిన నివేదికతో సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు ఎమ్మెల్యేపై కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న సాయంత్రమే కోర్టు ఆదేశాలు జారీ చేయగా, కొద్దిసేపటి క్రితం పరిగి పోలీసులు హరీశ్వర్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొన్నటి దాకా టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగిన హరీశ్వర్ రెడ్డి రాష్ట్ర విభజన నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన హరీశ్వర్ రెడ్డి విజయం సాధించారు.