: ఏపీని అభివృద్ధి చెయ్యండి...మా సీఎం సంగతి మీకెందుకు?: చంద్రబాబుకు కర్నె సూచన
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు, సరిపడా నిధులు లేవు అని చెబుతున్న సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై అవాకులు చవాకులు పేలడం ఎందుకని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ సూచించారు. హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన ఏపీ శాసనసభ సమావేశంలో చంద్రబాబునాయుడు... కేసీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడారని, శాసనసభలో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. చేతనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. కోస్టల్ కారిడార్, పారిశ్రామిక కారిడార్, రాజధాని, ప్రాజెక్టులు అంటూ నిధులు స్వాహా చేసి, తెలంగాణలో ప్రజాప్రతినిధులను కొనేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు తెలంగాణ నేతలను విమర్శించే హక్కు లేదని ఆయన విమర్శించారు. అవినీతికి పాల్పడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంకోసారి తమ నేతలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.