: హార్లే డేవిడ్సన్ షోరూంకు షాకిచ్చిన యువకుడు... టెస్ట్ డ్రైవ్ పేరిట రూ.6 లక్షల బైక్ తో పరారీ
చూడ చక్కటి రూపం.... అల్లంత దూరాన వెళ్లే వారి చెవులు చిల్లులు పడే శబ్దం... లక్షల ఖరీదు... ఇదీ హార్లే డేవిడ్సన్ బైకులకు సంబంధించి పరిచయ వాక్యాలు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఈ బైకుల షోరూం ఒకటి ప్రారంభమైనప్పుడు సంపన్నులతో పాటు మధ్య తరగతి జనం కూడా ఆసక్తిగా చూశారు. కోటీశ్వరులకు మినహా ఆ షోరూంలోకి వెళ్లే ధైర్యముండదు. ఎందుకంటే, ఆ కంపెనీ తయారు చేసే ఏ బైక్ అయినా కనీసం రూ.4 లక్షలు ఉంటుంది. కేవలం సంపన్నులు సందర్శించే ఈ షోరూమ్ కు కొద్దిసేపటి క్రితం ఓ యువకుడు షాకిచ్చాడు. దర్జాగా షోరూమ్ లోకి ఎంటరైన ఆ యువకుడు టెస్ట్ డ్రైవ్ కోసం బైక్ తాళాలు తీసుకున్నాడు. షోరూమ్ సిబ్బంది కళ్లెదుటే అతడు రూ.6 లక్షల విలువ చేసే బైక్ పై రోడ్డు మీదకు రయ్యిమని దూసుకెళ్లాడు. అంతే, ఇక తిరిగి రాలేదు. ఐదు నిమిషాలు, పది నిమిషాలు, అరగంట, గంట గడిచినా అతడి జాడ లేదు. బైక్ ను యువకుడు ఎత్తుకెళ్లాడని నిర్ధారించుకున్న షోరూమ్ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడి కోసం నగరాన్ని జల్లెడ పడుతున్నారు.