: సెన్సెక్స్ 586 పాయింట్లు డౌన్... మార్కెట్ భారీ పతనానికి టాప్-5 రీజన్స్!
నేటి భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లోకి జారిపోయింది. ఒకదశలో 700 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరికి కాస్తంత తేరుకుని 586 పాయింట్ల నష్టంతో, 25,696 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు కీలకమైన 7,800 పాయింట్ల వద్ద మద్దతు కోల్పోయిన నిఫ్టీ, ఆపై 7,750 దగ్గర నిలదొక్కుకోవడంలోనూ విఫలమై ఇన్వెస్టర్లలో ఆందోళనను మరింతగా పెంచింది. మార్కెట్లో ఇంత ఘోర పతనానికి కారణాలను అన్వేషిస్తే... అంచనాలకు దిగువన క్యూ1 జీడీపీ: తొలి త్రైమాసికంలో భారత స్థూలజాతీయోత్పత్తి 7 శాతానికి పరిమితమైంది. తొలుత వేసిన అంచనాలు 7.4 శాతంతో పోలిస్తే జీడీపీ తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఇదే సమయంలో వరల్డ్ బ్యాంక్, ఫిచ్, మూడీస్ తదితర సంస్థలు భారత వృద్ధి రేటు ముందస్తు అంచనాలను సవరించడం ఆందోళన కలిగించింది. యూఎస్ ఫెడ్ వడ్డీ పెంపు సూచన: అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో జరిపే పరపతి సమీక్ష తరువాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చని వస్తున్న అంచనాలు అమ్మకాలను ప్రభావితం చేశాయి. ఇప్పటికే ఫెడ్ వైస్ చైర్మన్ స్టాన్లీ ఫిశ్చర్ రేట్ల పెంపుపై సంకేతాలు వెలిబుచ్చారు. సెప్టెంబర్ 17 తరువాత బాండ్లపై మరింత వడ్డీని పొందవచ్చని ఆయన అన్నారు. అదే జరిగితే, స్టాక్, బులియన్ మార్కెట్ల పెట్టుబడులు యూఎస్ బాండ్ మార్కెట్ కు తరలిపోవడం ఖాయం చైనాలో మరింత మాంద్యం: ఇప్పటివరకూ చైనాలో వెలుగుచూసిన మాంద్యం, ఆర్థిక సంక్షోభం స్వల్పమేనని, ముందు ముందు చైనా ఉత్పత్తి గణాంకాలు మరింతగా నేలచూపులు చూస్తాయని వస్తున్న అంచనాలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. చైనా అధికార కొనుగోలు సూచిక (పీఎంఐ - పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) జూలైతో పోలిస్తే 50 పాయింట్ల నుంచి 49.7 పాయింట్లకు పడిపోయింది. దీంతో మంగళవారంనాటి చైనా మార్కెట్ 4 శాతం దిగజారగా, ఆసియా సూచీలతో పాటు సెన్సెక్స్, నిఫ్టీలపైనా ఒత్తిడి పడింది. క్రూడాయిల్ ధరలు: ఇటీవలి కాలం వరకూ తగ్గుతూ వచ్చిన క్రూడాయిల్ ధరలు పెరగడం మొదలయ్యాయి. ఇది కూడా మార్కెట్ ను కొంత మేరకు ప్రభావితం చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో యూఎస్ క్రూడాయిల్ ధర ఏకంగా 27 శాతం పెరిగింది. ఆగస్టు 1990 తరువాత కేవలం మూడు రోజుల్లో ముడి చమురు ధరలు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు: గడచిన ఆగస్టులో మొత్తం రూ. 17 వేల కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్ఐఐ (ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు)లు విక్రయించారు. జనవరి 2008 తరువాత ఒక నెలలో విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించిన అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. మన మార్కెట్ ను శాసించే స్థితిలో ఉన్న ఎఫ్ఐఐల వెంట దేశవాళీ ఇన్వెస్టర్లు పరుగెత్తడం కూడా 600 పాయింట్ల పతనానికి కారణమైంది. వీటితో పాటు తాజాగా విడుదలైన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ద్రవ్యోల్బణం, కీలక సంస్కరణల అమలు ఆలస్యం కావడం, బీహార్ ఎన్నికలు... తదితర అంశాలన్నీ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయని విశ్లేషకులు అభివర్ణించారు.