: జగన్ ఏపీ నేతా?... తెలంగాణ నేతా?: మంత్రి అచ్చెన్నాయుడు
అసెంబ్లీలో వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళనపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత మాట్లాడితేనే వైసీపీ సభ్యులు కూర్చుంటున్నారని, అధికారపక్ష సభ్యులు మాట్లాడితే వైసీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రసంగంలో ఒక్క కొత్త విషయం కూడా లేదని, రోజూ పేపర్లలో వచ్చేవే వున్నాయని విమర్శించారు. ఓటుకు నోటు కేసు పెద్ద గూడుపుఠాణి అని మండిపడ్డారు. మే 21న హరీశ్ రావును జగన్ కలిశారని, స్టీపెన్ సన్ కు ఎమ్మెల్యే పదవి ఇప్పించింది కూడా జగనేనని అన్నారు. హరీశ్ తో జగన్ భేటీలో స్టీఫెన్ సన్ కూడా ఉన్నారని తెలిపారు. వారిద్దరూ కలసిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఇంతకీ జగన్ ఏపీ నేతా?... తెలంగాణ నేతా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. 1600 మంది విద్యుత్ కార్మికుల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే ప్రతిపక్ష నేత కనీసం స్పందించలేదన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడాలి తప్ప రాజకీయ స్వార్థం కోసం కాదని సూచించారు.