: ఒక్క రూపాయికి ఫుల్ మీల్స్ లభించే నగరమిదే!


మీరు చదివింది నిజమే. కేవలం ఒక్క రూపాయికి కడుపునిండా భోజనం లభించే ఏకైక భారత నగరం తమిళనాడులోని ఈరోడ్. నిన్ననో, ఇవాళో కాదు... ఏకంగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సౌకర్యం లభిస్తోంది. ఫుల్ మీల్స్ తో పాటు పలు రకాల టిఫిన్స్ కూడా అందిస్తున్న ఆ వ్యక్తి పేరు వెంకటరామన్. ఏఎంవీ హోమ్లీ మెస్ యజమాని. ఉదయం నుంచి రాత్రి వరకూ ఈరోడ్ ప్రభుత్వాసుపత్రి వద్ద రూపాయి టోకెన్ తీసుకుని ఇష్టమైనవి తినవచ్చు. 2007లో తనకు ఎదురైన ఓ సంఘటన నుంచి పేదలకు ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చిందంటాడు వెంకటరామన్. అప్పట్లో రూ. 10కి మూడు దోశలను అమ్ముకునే వాడినని, ఆ మొత్తం వెచ్చించే స్తోమత లేని ఓ పేద మహిళా రోగి ఆవేదన తనను ఆలోచనలో నెట్టిందని, అందువల్లే ఈ రూపాయికి భోజనం ఆలోచన చేశానని చెబుతున్నారు. రోగులతో పాటు వారి బంధువులకు కూడా ఆహారం అందిస్తున్నానని, తొలుత 10 మందికి టోకెన్లిచ్చి రూపాయి ఆహారం అందించానని, ఇప్పుడు రోజుకు 70 మంది వరకూ ఈ సదుపాయం పొందుతున్నారని తెలిపారు. కనీసం రూ. 50 పెడితేగాని అంతంతమాత్రం భోజనం లభించని ఈ రోజుల్లో రూపాయికే ఐదు రకాల వంటకాలతో రుచికరమైన భోజనం పెడుతున్న వెంకటరామన్ సేవా దృక్పథాన్ని పలువురు అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News