: జగన్ గారూ.... మీరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు: స్పీకర్ కోడెల వ్యాఖ్య
కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ కోసం వైసీపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో నిరసన వ్యక్తం చేసిన జగన్ మైక్ కోసం పదే పదే పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్ గారూ... మీరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేందుకు అవకాశమిస్తేనే మీ సభ్యులు కూర్చుంటామనేలా వ్యవహరిస్తున్నారు. సభలో మీరు కాకుండా ఎవరు మాట్లాడినా మీ సభ్యులు వినేలా లేరు’’ అంటూ కోడెల వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ అదే అంశంపై వాయిదా తీర్మానం అవసరం లేదని ఆయన చెప్పారు. దీనిపై నేడే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సభా సమయాన్ని వృథా చేయవద్దంటూ ఆయన విపక్ష సభ్యులను కోరారు.