: ఆ నిధులు రెండు రోజుల్లోగా వెనక్కిస్తాం... వెంకయ్యకు జైట్లీ హామీ


తెలంగాణ ఖాతా నుంచి కేంద్రం లాగేసుకున్న రూ.1,250 కోట్ల నిధులు ఎట్టకేలకు తిరిగి ఆ రాష్ట్రానికి రానున్నాయి. పన్ను చెల్లింపులో జాప్యాన్ని కారణంగా చూపుతూ కేంద్రం ఈ నిధులను ముందస్తు సమాచారం లేకుండానే లాగేసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైంది. రెండు నెలల పాటు ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగుల వేతనాలు మినహా ఏ ఇతర ఖర్చులకు కూడా నిధులు విడుదల చేయరాదని కూడా ప్రభుత్వం ఆయా శాఖలకు తేల్చిచెప్పింది. ఈ నిధులను తిరిగి రాబట్టుకునేందుకు తెలంగాణ సర్కారు చేసిన యత్నాలు ఇప్పటిదాకా ఫలించలేదు. తాజాగా ఈ విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ సర్కారు నుంచి లాగేసుకున్న నిధులను తక్షణమే ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన జైట్లీని కోరారు. దీనికి స్పందించిన జైట్లీ రెండు రోజుల్లోగా ఆ నిధులను తెలంగాణ ఖాతాకు జమ చేస్తామని వెంకయ్యకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News