: శరీరంలో రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ ... శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ మహిళ
శరీర అంతర్భాగాల్లో మాదకద్రవ్యాల సీసాలు దాచుకున్న ఓ మహిళను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ అమెరికాకు చెందిన మూసా (32) అనే మహిళ దాదాపు రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ నింపిన రెండు సీసాలను తన శరీర అంతర్భాగాల్లో పెట్టుకుని హైదరాబాద్ రాగా, అధికారుల తనిఖీల్లో దొరికిపోయింది. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఆమెకు స్కానింగ్ నిర్వహించగా, సీసాల గుట్టు రట్టయింది. అయితే, ఇలా సీసాలు పెట్టుకుని రావడం ఆమె ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది. ఓ సీసాను బయటికి తీసిన అధికారులు, మరో సీసాను బయటికి తీసేందుకు విఫలయత్నం చేశారు. దాంతో, శస్త్రచికిత్స నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటిదాకా, బంగారం పట్టివేతలకు బాగా ప్రసిద్ధికెక్కిన శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ పట్టుబడడం చర్చనీయాంశం అయింది. హైదరాబాదులో సంపన్న వర్గాలకు చెందిన యువత మాదకద్రవ్యాలతో పట్టుబడిన ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు పట్టుబడిన డ్రగ్స్ ఎవరికి చెందినవన్న విషయాన్ని పరిశోధించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.