: మేమేం గొంతెమ్మ కోర్కెలు కోరలేదు... మా హక్కులే అడుగుతున్నాం: హార్దిక్ పటేల్
గుజరాత్ లో భారీ ఆందోళనలతో ఆ రాష్ట్ర ప్రభుత్వానికే కాక కేంద్రానికి ముచ్చెమటలు పట్టించిన యువ సంచలనం హార్దిక్ పటేల్ నేడు ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన తమ వాదనను సూటిగా మూడు ముక్కల్లో చెప్పేశారు. ప్రభుత్వాన్ని తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్న ఆయన, తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని ప్రకటించారు. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల కోసం తాము చేస్తున్న ఉద్యమంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి భాగస్వామ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని చెప్పిన హార్దిక్ పటేల్, రేపు మధ్యప్రదేశ్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.