: డొక్కా సైకిలెక్కడం పెద్ద వార్తేమీ కాదు: ఏపీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్య
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. అంతేకాదు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన హేమాహేమీలంతా పార్టీని వీడారు. రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి తదితరులు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇక తమ పార్టీలో చేరమంటూ డొక్కాకు వైసీపీ ఆహ్వానం పంపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై వల్లమాలిన అభిమానమున్న డొక్కా మాత్రం ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాజాగా తన గురువు రాయపాటి సాంబశివరావు సూచన మేరకు డొక్కా నేటి ఉదయం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సైకిలెక్కేశారు. దీనిపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పందించారు. డొక్కా టీడీపీలో చేరిన విషయమేమీ పెద్ద వార్త కాదంటూ ఆయన తేలిగ్గా తీసుకున్నారు. చాలాకాలం నుంచి డొక్కా తమ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.