: అండర్ వరల్డ్ డాన్ నయా దందా... నెత్తుటి వజ్రాల వ్యాపారంలో దావూద్ బిజీబిజీ
1993 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ గా పేరుగాంచిన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్, మనీ లాండరింగ్, హవాలా, బెట్టింగ్, నకిలీ కరెన్సీ చెలామణి... ఇవేగా అతడి వ్యాపారం అనుకుంటున్నారా? నిన్నటిదాకా ఇవే అతడి వ్యాపారం. అయితే అతడు తాజాగా రూటు మార్చాడట. నెత్తుటి వజ్రాలుగా పేరుపడ్డ ముతక వజ్రాలను అతడు ఆఫ్రికా దేశాల నుంచి దుబాయ్ కి తరలిస్తున్నాడట. అంతేకాక దుబాయ్ లో ముతక వజ్రాలకు సానబెట్టించి ఇతర దేశాల్లో వాటిని విక్రయిస్తూ భారీగా సంపాదిస్తున్నాడని భారత నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని సేకరించాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ వర్గాలు దావూద్ నయా దందాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాయి. ఆఫ్రికా దేశాలు కాంగో, అంగోలా, సియోర్రాలియోన్ తదితర దేశాలు మేలు జాతి వజ్రాలకు నెలవు. ప్రస్తుతం అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాల్లో తిరుగుబాటు దళాలు వజ్రాల గనులను స్వాధీనం చేసుకుని అమాయక ప్రజలను బానిసలుగా మార్చి వజ్రాలను తవ్విస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ లక్షలాది మంది ప్రజలు తిరుగుబాటు దళాల దాడుల్లో బలైపోయారు. ఈ కారణంగానే ఈ వజ్రాలకు నెత్తుటి వజ్రాలు (బ్లడ్ డైమండ్స్)గా పేరు పడిపోయింది. తిరుగుబాటు దళాలకు ఆయుధాలు సమకూరుస్తున్న వ్యాపారులు వారు సేకరించే వజ్రాలను తక్కువ ధరలకే చేజిక్కించుకుంటున్నారు. ఇతర దేశాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై సమగ్ర వివరాలు సేకరించిన దావూద్ ఇబ్రహీం... ఇదేదో బాగుందే అనుకుని ఈ వ్యాపారంలోకి దిగిపోయాడట. ఆఫ్రికా దేశాల్లో దావూద్ ఏజెంట్ గా రహమత్ వ్యవహరిస్తున్నాడు. ఇతడే దావూద్ కు కావాల్సిన ముడి వజ్రాలన్నింటినీ గుట్టు చప్పుడు కాకుండా అందజేస్తున్నాడు. రహమత్ ద్వారా ఆఫ్రికా దేశాల నుంచి దుబాయ్ చేరుకునే ఈ ముతక వజ్రాలను ఫిరోజ్ ఒయాసిస్ అనే వ్యక్తి సానబెట్టిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఫిరోజ్, దావూద్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఎదిగాడు. ఫిరోజ్ సానబెట్టించిన వజ్రాలు జావెద్ చుతానీ అలియాస్ డాక్టర్ విదేశాల్లో విక్రయిస్తాడు. ఈ దందాలో దావూద్ కు మునుపటి కంటే కూడా మెరుగైన రాబడే వస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.