: స్త్రీ, పురుష సమానత్వం పాటిస్తామంటున్న ట్విట్టర్
సోషల్ మీడియాలో అత్యధిక వినియోగదారులున్న ట్విట్టర్ సంస్థ ఇక నుంచి స్త్రీ, పురుష సమానత్వం పాటించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తమ సంస్థలో మరింత మంది మహిళలను నియమించాలని అనుకుంటున్నట్టు ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్ హౌసీ తన బ్లాగ్ స్పాట్ లో తెలిపారు. దాంతో పలు రంగాల్లో లింగ వివక్షను రూపుమాపేందుకు తమవంతుగా తొలి ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించేందుకే తామీ నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు. సాంకేతిక రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా అవసరమన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో 4వేల మంది ఉద్యోగులు ఉండగా వారిలో కొద్దిమంది మాత్రమే మహిళా ఉద్యోగులున్నారని హౌసీ వెల్లడించారు. వచ్చే సంవత్సరంకల్లా సాంకేతిక ఉద్యోగాల్లో 16 శాతం, మిగతా రంగాల్లో 35 శాతం మహిళలను నియమించేందుకు ఆలోచిస్తున్నామన్నారు.