: హోదాపై ఎంత సమయం కావాలో పవన్ చెప్పాలి: బొత్స
ప్రత్యేక హోదా వస్తే ఒక్కో పట్టణం ఒక్కో హైదరాబాద్ లా తయారవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హోదాతో పరిశ్రమలకు మనుగడ, యువతకు ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగ అవకాశాలు కోల్పోయామన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఈరోజు వైసీపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బొత్స మాట్లాడుతూ, హోదా కాకుండా ప్యాకేజీ వస్తే అది పెద్దల పంపకానికే సరిపోతుందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే హోదా రావట్లేదని, బంద్ ను విఫలం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు. హోదా వచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హోదా సంజీవిని కాదంటున్న నేతలు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఇంకొంత కాలం వేచిచూద్దామన్న పవన్ మాటలపై బొత్స స్పందిస్తూ, హోదాపై ఎంత సమయం కావాలో పవన్ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.