: హాలీవుడ్ సూపర్ స్టార్ అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ మరణవార్త కేవలం పుకారే!
ప్రముఖ హాలీవుడ్ నటుడు, 'టెర్మినేటర్' ఫేం అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారన్న వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా సంతాపాలను పోస్ట్ చేశారు ఆయన అభిమానులు. ఎంతో మంది తమ బాధను వ్యక్తీకరించారు. అయితే, ఇదంతా కేవలం పుకారే అని తేలిపోయింది. ఈ వార్త ఏవిధంగా స్ప్రెడ్ అయిందంటే... "68 ఏళ్ల వయసున్న అర్నాల్డ్ లాస్ ఏంజెలెస్ లోని కాలిఫోర్నియా హోంలో బెడ్ పై విగతజీవిగా కనిపించారు. లాస్ ఏంజెలెస్ పోలీసులకు చెందిన 911 నెంబర్ కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అన్ రెస్పాన్సివ్ మేల్ (స్పందించని పురుషుడు) అంటూ ఈ కాల్ వచ్చింది. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు అర్నాల్డ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతలో అతను చనిపోయి ఉండవచ్చని లాస్ ఏంజెలెస్ పోలీస్ చీఫ్ జేమ్స్ జె.ఫ్రీదా తెలిపారు. అర్నాల్డ్ మృతికి గల కారణాలు తెలియరాలేదని... ఈ మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు, అర్నాల్డ్ మృతిని అతని కుటుంబానికి సన్నిహితుడైన ఒక వ్యక్తి కూడా ధ్రువీకరించారు" అంటూ కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేయడంతో యావత్ ప్రపంచం షాక్ కు గురైంది. అయితే, అర్నాల్డ్ ప్రతినిధులు నిన్న ఈ వార్తను కొట్టిపారేశారు. అర్నాల్డ్ కు ఏమీ కాలేదని, ఆరోగ్యంగా, హాయిగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. మరోవైపు, తన అధికారిక ట్విట్టర్ పేజ్ లో అర్నాల్డ్ తన ట్వీట్లను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. సో, ఆల్ ఈజ్ వెల్!