: స్టాక్ మార్కెట్ భవిష్యత్ చైనా చేతుల్లో కాదు... బీహారీల గుప్పిట్లో!
ఇటీవలి కాలంలో భారత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతూ, నేల చూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇక భవిష్యత్ ఎటువైపు? అన్న ప్రశ్నకు తొలి సమాధానంగా చైనా కనిపిస్తోంది. చైనా మార్కెట్ మరింతగా కష్టాల్లో కూరుకుపోతే, దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పై ప్రతికూలతను చూపుతుంది. అయితే, అంతకన్నా ముందుగానే, వచ్చే నెలలో స్టాక్ మార్కెట్ కు దిశానిర్దేశం చేసే ప్రధాన అంశాల్లో బీహారీలు ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు మార్కెట్ గమనాన్ని మారుస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం మోదీ ప్రజాకర్షణ ఏ మేరకు ఉందన్న విషయంపై మాత్రమే కాదు, దేశవాళీ స్టాక్ మార్కెట్ సెంటిమెంటు, ఎన్డీయే పాలనపై రెఫరెండంగా కూడా ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రంలోకి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. త్వరలో జరిగే బీహార్ ఎన్నికల్లో సైతం అదే విధమైన ఫలితాలు వస్తే, మోదీ హవా తగ్గిందని స్పష్టంగా నమ్మవచ్చు. ఇది 'బ్రాండ్ మోదీ'కే కాకుండా, 'మేకిన్ ఇండియా'కు, కీలక సంస్కరణల అమలుకు విఘాతం కావచ్చని దేశవాళీ బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ ఎకానమిస్ట్ జై శంకర్ వివరించారు. బీహారులో రాజకీయ పవనాలు ఏ పార్టీకి అనుకూలంగా మారతాయన్న విషయంలో దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, మీడియా, రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన 15 నెలల పాలన తరువాత ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో బీహార్ రాష్ట్రానికి భారీ ప్యాకేజీలను సైతం మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం పెరగాలంటే, బీహార్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం తప్పనిసరి. ఆ రాష్ట్రానికి రాజ్యసభలో 16 స్థానాలు దక్కుతాయి. బీహార్ నుంచి బీజేపీ తరపున సంఖ్యాబలం పెరగాలంటే, ఎన్నికల్లో విజయం అనివార్యం. బీహార్ ఎన్నికలు సంస్కరణల వేగాన్ని ప్రభావితం చేయనున్నాయని, అయితే కేంద్ర ప్రభుత్వ సుస్థిరతను మాత్రం మార్చలేవని బ్యాంక్ ఆఫ్ అమెరికా అనలిస్టు అభిషేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. బీహార్ ఎన్నికలతో పాటు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్ష, కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు, ప్రపంచ మార్కెట్ల గమనం వంటి ఇతరత్రా అంశాలూ భారత స్టాక్ మార్కెట్ భవిష్యత్ పయనంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.