: తెలంగాణలో రిటైరైన ఏపీ ఉద్యోగులకు బాబు సర్కారు బంపరాఫర్
ఏపీకి కేటాయించబడినా అక్కడికి వెళ్లకుండా తెలంగాణలోనే వుండిపోయి, రిటైరైన ఏపీ ఉద్యోగుల్లో 58 సంవత్సరాలు దాటిన వారు, మరో రెండేళ్ల పాటు కొనసాగుతూ, ఆంధ్రాలో విధులు నిర్వహించుకోవచ్చని చంద్రబాబు సర్కారు ఆహ్వానించింది. అయితే, వీరికి 60 సంవత్సరాలు నిండకూడదని స్పష్టం చేసింది. గత సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కమల్ నాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు ఉద్యోగుల విభజన జరుగగా, ఏపీ స్థానికత కలిగివుండి, తెలంగాణలో పనిచేస్తూ, ఏపీకి నియమితులైన వారిలో అత్యధికులు విధుల్లో చేరలేదు. వీరిలో కొందరు ఉద్యోగ విరమణ కూడా చేశారు. ఏపీలో రిటైర్మెంట్ పరిమితి 60 ఏళ్లుగా ఉండగా, తెలంగాణలో 58 ఏళ్లుగా ఉన్న సంగతి విదితమే. దీంతో ఏపీ స్థానికత ఉండి, తెలంగాణలో పనిచేస్తూ, రిటైరైన ఉద్యోగులు తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. కొందరు మాత్రం ముందు జాగ్రత్తతో పదవీ విరమణకు ముందుగా ఆంధ్రప్రదేశ్ లో చేరిపోయి లబ్ధి పొందారు. రిలీవింగ్ ఆర్డర్ రాక తెలంగాణలో మిగిలిపోయి రిటైరైన వాళ్ల కోసం సుదీర్ఘ ఆలోచనలు చేసిన ఏపీ సర్కారు ఇప్పుడీ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి వారి సంఖ్య వందల్లో మాత్రమే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఇది తెలంగాణలో ఇటీవల పదవీ విరమణ చేసిన వారికి బంఫరాఫరే!