: రేపు మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు...రాజ్ నాథ్ లో భేటీ కానున్న ఏపీ సీఎం


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎం హోదాలో రేపు మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దాదాపు గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అయితే చంద్రబాబు అనుకున్న మేరకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ, స్పెషల్ గ్రాంట్ కోసం చంద్రబాబు మంతనాలు సాగించారు. మొన్నటి ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే రేపు ఆయన మళ్లీ ఢిల్లీ బాట పడుతున్నారు. విజయవాడలో రేపు జరిగే కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత అక్కడి నుంచే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలో ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అవుతారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News