: ఫేస్ బుక్ విడుదల చేసిన కొత్త యాప్ 'మూమెంట్స్'... సూపర్ ఫీచర్లంటున్న నెటిజన్లు
మీ ఫోటోలను చేరిస్తే, అందుకు తగ్గ మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేస్తుంది. మరింత సులువుగా చిత్రాలను స్నేహితులతో పంచుతుంది. ఆ ఫోటోల్లో ఎవరున్నారు? ఎప్పుడు, ఎక్కడ తీశారు? వంటి వివరాలు అడక్కుండానే చెప్పేస్తుంది. ఇటువంటి వినూత్న ఫీచర్లతో కూడిన సరికొత్త యాప్ 'మూమెంట్స్'ను ఫేస్ బుక్ విడుదల చేసింది. ఈ యాప్ రెండు రోజుల క్రితం విడుదల కాగా, దీన్ని వాడుతూ 'సూపర్' అని మురిసిపోతున్న వారి సంఖ్య వేలు దాటి లక్షల్లోకి చేరిపోయింది. అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై ఇది అందుబాటులో ఉంది. మీ స్మార్ట్ ఫోన్లో గతంలో తీసుకున్న చిత్రాలను ఈ యాప్ ద్వారా తెరిస్తే అది తేదీల వారీగా చెప్పడమే కాకుండా, చిత్రాల్లోని మనుషులను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తుపట్టి ఫోటోలను గ్రూపులుగా కూడా విడగొడుతుంది. కనీసం ఆరు ఫోటోలను జోడిస్తే మ్యూజిక్ వీడియోలు తయారవుతాయి. నెటిజన్లకు నచ్చే ఫీచర్లతో ఇప్పుడీ 'మూమెంట్స్' దూసుకెళ్తోంది.