: మంత్రి కామినేని ఆసుపత్రి నిద్ర కేవలం ప్రచారానికేనా?: ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువును ఎలుకలు పీక్కుతిన్న ఘటన నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడుతోంది. కామినేని గతంలో చేపట్టిన ఆసుపత్రిలో నిద్ర కార్యక్రమం కేవలం ప్రచారానికేనా? అని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. దాంతో రోగులకు ఎలాటి ఉపయోగం లేదన్నారు. శిశువు చనిపోయిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు మంత్రులు నైతిక బాధ్యత వహించాల్సింది పోయి బాధను వ్యక్తం చేయడం దారుణమన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలోె ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఘటన బాధితులకు కేవలం రూ.2 లక్షలే ఎక్స్ గ్రేషియో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ఉన్నతస్థాయి కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.