: చైనాను వీడనున్న పానాసోనిక్... ప్లాంటు మూసివేత!
చైనాలో నెలకొన్న ఆర్థిక కష్టాలు, విపరీతమైన పోటీ కారణంగా బీజింగ్ లోని లీథియం అయాన్ బ్యాటరీల తయారీ కేంద్రాన్ని జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పానాసోనిక్ మూసివేయనుంది. దీంతో సుమారు 1,300 మంది ఉద్యోగాలు ఊడనున్నాయని నిక్కీ బిజినెస్ డైలీ గురువారం నాడు వెల్లడించింది. మొబైల్ ఫోన్లకు, కెమెరాలకు బ్యాటరీలను తయారు చేస్తున్న ఇక్కడి ప్లాంటు నుంచి లాభాలు రావడం లేదని పత్రిక వెల్లడించింది. దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫ్యాక్టరీని వచ్చే నెలలో షట్ డౌన్ చేయాలని పానాసోనిక్ నిర్ణయించిందని పేర్కొంది. కాగా, ఈ ప్లాంటును పానాసోనిక్ చైనా అనుబంధ సంస్థ సాన్యో ఎలక్ట్రిక్ నిర్వహిస్తోంది. ఇకపై కార్లు తదితర వాహనాల బ్యాటరీలను తయారు చేయడంపైనే దృష్టిని సారించాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు పానాసోనిక్ అధికారులు అందుబాటులో లేరు.