: మృతులకు రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలి... పోలీసులపై కేసులు పెట్టాలి: గుజరాత్ పటేళ్ల డిమాండ్
ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టిన గుజరాత్ పటేల్ సామాజిక వర్గం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగుతోంది. ఇప్పటికే యువ సంచలనం హార్దిక్ పటేల్ నేతృత్వంలో మూడు రోజుల క్రితం జరిగిన పోరుబాట తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిన్న జరిగిన పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో ఘటనలో ఇంకో వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనలపై పటేళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక కాల్పులు జరిపిన పోలీసులపై హత్యానేరాల కింద కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్ల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టని పక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని పటేళ్లు హెచ్చరిస్తున్నారు.