: సీఎం రమేశ్, జగన్, కేటీఆర్ ల మధ్య మాటా మంతి!


టీడీపీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం, ఆ తర్వాత జగన్ నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఫోన్ చేయడం సాధ్యమేనా? అంటే, ఎందుకు కాదంటున్నారు వీరి మధ్య ఉన్న సంబంధాలు తెలిసిన వారు. వీరి మధ్య ఏ విధమైన సంబంధాలు ఉన్నాయన్న అంశాన్ని పక్కనబెడితే, ప్రస్తుతం వీరు ముగ్గురూ మూడు నెలలుగా జీతాల్లేక నానా పాట్లు పడుతున్న 1,250 మంది ఉద్యోగుల పక్షాన వకాల్తా పుచ్చుకున్నారు. ఈ ముగ్గురు కలిసినా సదరు ఉద్యోగుల సమస్య తీరలేదట. అసలు విషయమేంటంటే, సీమాంధ్ర మూలాలున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం విధుల్లో నుంచి తప్పించిన 1,250 మంది విద్యుత్ శాఖ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు లేవు. కేసీఆర్ సర్కారు తొలగించిన వీరిని ఇటు తెలంగాణ తీసుకోవడం లేదు, అటు ఏపీ నిస్సహాయత వ్యక్తం చేసింది. దీంతో వీరి సమస్య ఇప్పుడప్పుడే పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల వీరంతా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారట. వీరి సమస్య పరిష్కారం కోసం ఓ పక్కా ప్రణాళికను రచించిన సీఎం రమేశ్ నేరుగా జగన్ కు ఫోన్ చేశారట. సమస్యను వివరించి, కాస్తంత కేసీఆర్ తో మాట్లాడమని ఆయన జగన్ ను కోరారు. సీఎం రమేశ్ ప్రతిపాదననకు సరేనన్న జగన్ వెనువెంటనే ఫోన్ తీసి కేసీఆర్ కు కాకుండా, ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేశారట. ఆ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయించాలని కోరారు. జగన్ ప్రతిపాదనకు సరేనన్న కేటీఆర్ ఆ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. అయితే ‘పెద్దాయన వద్దన్నారు’ అన్న ఒకే ఒక్క మాటతో ఈ ముగ్గురి యత్నాలకు అధికారులు చెక్ పెట్టేశారట.

  • Loading...

More Telugu News