: అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ... లైవ్ షోలో నిమగ్నులైన ఇద్దరు టీవీ జర్నలిస్టులు బలి
అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది! ఇద్దరు టీవీ జర్నలిస్టులు లైవ్ షోలో నిమగ్నులై ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరపడంతో వారు ప్రాణాలు విడిచారు. వర్జీనియాలో మోనెటా ప్రాంతంలోని బ్రిడ్జ్ వాటర్ ప్లాజాలో డబ్ల్యూడీబీజే7 చానల్ కోసం మహిళా రిపోర్టర్ అలిసన్ పార్కర్ (24), వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్ (27) మార్నింగ్ లైవ్ షో నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తుపాకీ చేతబట్టి ఆ భవనంలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులకు తెరదీశాడు. ఈ కాల్పుల్లో మహిళా రిపోర్టర్, వీడియో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల సమయంలో, కెమెరా కిందపడిపోగా, అందులో ఘటన తాలూకు దృశ్యాలు రికార్డవడమే కాకుండా ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఆగంతుకుడు బ్లాక్ ప్యాంట్, బ్లూ టాప్ ధరించి ఉన్నట్టు వెల్లడైంది. కాగా, ఆ దుండగుడు ప్లాజాలోనే ఉండడంతో, సమీపంలోని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలను తెరవరాదని భద్రతా బలగాలు ఆదేశించాయి. ప్లాజాను చుట్టుముట్టిన ప్రత్యేక బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి.