: భారత యువకుడి వీసా కోసం లండన్ యువతి పోరాటం
ఓ భారతీయ యువకుడి వీసా కోసం లండన్ యువతి పోరాడుతోంది. వివరాల్లోకి వెళ్తే... భారత్ కు చెందిన అమిత్ చావ్లా (27) యూకేలో విద్యనభ్యసించేందుకు వెళ్లాడు. వీసా గడువు ముగిసినప్పటికీ స్నేహితుల సాయంతో అక్రమంగా అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో అమిత్ కు ఆన్ లైన్ ఛాటింగ్ ద్వారా క్లెయిర్ మే (34) అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రేమ కానుకగా రియా అనే పాపకు ఆరు నెలల క్రితం క్లెయిర్ మే జన్మనిచ్చింది. దీంతో క్లెయిర్ ను వివాహం చేసుకుని లండన్ లోనే స్థిరపడదామని భావించిన అమిత్ వీసా కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అమిత్ తమ దేశంలో అక్రమంగా ఉంటున్నాడని గుర్తించిన అధికారులు అతనిని భారత్ కు పంపించేశారు. వివాహం చేసుకుని స్థిరపడదామని భావించేంతలో అమిత్ ను భారత్ పంపేయడంతో ఆందోళన చెందిన క్లెయిర్ మే, కాబోయే భర్తకు వీసా జారీ చేయాలంటూ ఆమె పోరాటం చేస్తోంది. కాగా, క్లెయిర్ మే ట్రిపుల్ ఎక్స్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి బారిన పడినవారు షార్ట్ టైమ్ మెమరీ, డిస్లెక్సియా, కండరాల బలహీనతతో బాధపడుతుంటారు. దీంతో ఆమెకు అంగవైకల్యం కింద బ్రిటన్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అలా వచ్చిన మొత్తాన్ని అమిత్ ను లండన్ రప్పించేందుకు వినియోగిస్తోందని అక్కడ విమర్శలు వస్తున్నా క్లెయిర్ లెక్కచేయడం లేదు. త్వరలోనే భారత్ వెళ్లి అమిత్ ను వివాహం చేసుకుని, డిపెండెంట్ వీసా ద్వారా అతనిని లండన్ తీసుకెళ్లాలని ఆమె భావిస్తోంది.