: చంద్రబాబు, నితీష్ కుమార్ కూడా మావాళ్లే!: హార్దిక్ పటేల్


గుజరాత్ లో పటేల్ (పటిదార్) కులస్తులను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ పిలుపు మేరకు పటేల్ కులస్తులు ఈ రోజు అహ్మదాబాద్ లో భారీ ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించారు. ఈ కార్యక్రమం హింసాత్మక రూపు దాల్చడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హార్దిక్ పటేల్ ను అరెస్ట్ చేసి, కాసేపటి తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతూ, "బీహార్ సీఎం నితీష్ కుమార్ మావాడే... మరో విషయం ఏమిటంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మావాడే. దేశ వ్యాప్తంగా మావాళ్లు 27 కోట్ల మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా మాకు 170 మంది ఎంపీలు ఉన్నారు" అని అన్నారు. తాము సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులమని... రాజకీయంగా తాము ఎదిగినప్పటికీ, ఉద్యోగాల విషయంలో మాత్రం తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి ఆనందీబెన్ చెప్పడాన్ని హార్దిక్ తప్పుబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి తమ వినతి పత్రాన్ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు 48 గంటలపాటు తాను నిరాహార దీక్ష చేపడుతున్నానని ప్రకటించారు.

  • Loading...

More Telugu News