: వాట్సప్ లాంటి యాప్స్ ఎవరు వినియోగిస్తున్నారో తెలుసా?
ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ విస్తృతమవుతోంది. దీంతో ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి షోషల్ మీడియా ద్వారా కొత్త స్నేహితులను కలుసుకోవడం, అభిప్రాయాలు షేర్ చేసుకోవడం సాధారణంగా మారింది. కానీ క్లోజ్ ఫ్రెండ్స్, మనకు పూర్తిగా తెలిసిన వారితో స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు కొన్ని సార్లు సోషల్ మీడియాలో కుదరడం లేదు. దీనికి పరిష్కారంగా మెసేంజర్, వాట్స్ యాప్, స్నాప్ చాట్ వంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎవరు ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ సర్వే చేసింది. సుమారు 1600 మంది ఇంటర్నెట్ యూజర్లపై సర్వే చేయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయని ఆ సంస్థ తెలిపింది. యువతరం సమాచార మార్పిడికి సరికొత్త పద్ధతులు అవలంబిస్తోందని, ఆ క్రమంలో మొబైల్ యాప్స్ వాడేందుకు ఆసక్తి చూపిస్తోందని సర్వే వెల్లడించింది. 36 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వాట్స్ యాప్, ఐమెసేజ్, కిక్ వంటి స్మార్ట్ ఫోన్ యాప్స్ వినియోగిస్తున్నారని సర్వే పేర్కొంది. 17 శాతం మంది సెంట్ మెసేజ్ లు ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోయే స్నాప్ చాట్, విక్కర్ వంటి యాప్స్ వినియోగిస్తున్నారని సర్వే వెల్లడించింది. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్కులు సెంట్ మెసేజ్ డిలీట్ అయిపోయే యాప్స్ వాడేందుకు మొగ్గుచూపుతున్నారని సర్వే తెలిపింది. యాప్స్ వినియోగించేవారు ఎస్ఎంఎస్ లు పంపడం మానేశారని, ఏ విషయాలైనా యాప్స్ ద్వారానే పంచుకుంటున్నారని సర్వే స్పష్టం చేసింది.