: ఆ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించండి: పాక్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం


పాకిస్థాన్ లోని కరాక్ జిల్లాలో నేలకూల్చిన హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ జవాద్ ఎస్ ఖావాజా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చిందని 'డాన్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. హోం శాఖ కార్యదర్శి అరబ్ మహమ్మద్ ఆరిఫ్, పీఎంఎల్-ఎన్ ఎంఎన్ఎ పార్టీ నేత రమేష్ కుమార్ వాంక్వానీ, కరాక్ డిప్యూటీ కమిషనర్ షోయబ్ జాదూన్ లు కలసి చర్చించి శ్రీ పరమహంస జీ మహరాజ్ దేవాలయాన్ని తిరిగి కట్టే విషయమై ఓ నిర్ణయానికి రావాలని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోను దేవాలయాన్ని తిరిగి కట్టాలని తేల్చి చెప్పింది. గతంలో లాహోర్ మార్కెట్లో చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతినకుండా దేవాలయాన్ని పునర్నిర్మించిన ఆర్కిటెక్చర్ కమిల్ ఖాన్ సలహాలు తీసుకోవాలని సూచించింది. కేసు విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేస్తూ, ఈ లోగా చర్చించి ఆ వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. స్వాతంత్ర్యానికి పూర్వం 1919లో శ్రీ పరమహంస మరణించిన ఈ స్థలంలో ఆయన శిష్యులు మందిరం నిర్మించగా, 1997 వరకూ అక్కడ పూజలు జరిగాయి. ఆ తరువాత దేవాలయాన్ని కూల్చేయగా, స్థానిక ముఫ్తీ ఇఫ్తికారుద్దీన్ ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు.

  • Loading...

More Telugu News