: అట్టుడుకుతున్న గుజరాత్... హింసాత్మకంగా మారిన పటేళ్ల ఆందోళన
ఓబీసీ రిజర్వేషన్ల కోసం పటేల్ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన గుజరాత్ లో తీవ్ర ఉద్రిక్తతలకు తెరలేపింది. నిన్న రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలకు దిగిన పటేల్ సామాజిక వర్గం అర్ధరాత్రి రెచ్చిపోయింది. ప్రభుత్వ ఆస్తులపై విధ్వంసానికి దిగింది. అధికార బీజేపీ నేతల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించింది. ప్రజా రవాణా వ్యవస్థపై మూకుమ్మడి దాడి చేసింది. తత్ఫలితంగా ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాదుతో పాటు సూరత్, మోసానా తదితర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అహ్మదాబాదు, సూరత్ లలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మోసానాలో కర్ఫ్యూ విధించారు. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను పోలీసులు నిలిపివేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.