: క్రెడిట్ కార్డు భారమైందా? 'బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' గురించి తెలుసుకోండి!
మీ క్రెడిట్ కార్డుపై చెల్లించాల్సిన మొత్తం ఒక్కసారిగా పెరుగుతున్నట్టు అనిపిస్తోందా? కార్డును వాడకపోయినా బకాయిపడ్డ మొత్తం పెరుగుతూ ఉందంటే, అందుకు కారణం వడ్డీ భారమే. కార్డు పరిమితి వరకూ వాడిన తరువాత ఆ భారాన్ని తగ్గించుకునే మార్గాలుంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న ‘బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్’ సౌకర్యం గురించిన వివరాలు తెలుసుకుంటే క్రెడిట్ కార్డుపై భారం కాస్తంతైనా తగ్గించుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటే: క్రెడిట్ కార్డు కష్టాలు కొంతమేరకు తగ్గాలంటే, ‘బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్’ విధానం సరైన మార్గం. ఇందులో క్రెడిట్ కార్డును జారీ చేసిన కంపెనీ తమ కస్టమర్ ఖాతాలో బకాయి ఉన్న బ్యాలెన్స్ లో కొంత మొత్తాన్ని తక్కువ వాడిన కార్డుకు లేదా కొత్త క్రెడిట్ కార్డుకు బదిలీ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి. కస్టమర్లకు కొత్త కార్డు ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఈ తరహా ‘బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్’ను ప్రోత్సహిస్తున్నాయి. తమ వద్ద ‘బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్’ సదుపాయాన్ని తీసుకుంటే వడ్డీ రహిత కాలపరిమితి, ఆపై తక్కువ వడ్డీ ఉంటుందని ఆశ పెడుతున్నాయి. ‘బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్’ సౌకర్యాన్ని వాడితే క్రెడిట్ లిమిట్ పాత కార్డునుంచి కొత్త కార్డుకు వెళుతుంది. దీంతో రెండు కార్డుల్లోనూ వేరియంట్ ను బట్టి వాడుకునే డబ్బు అవధి ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు, మీ కార్డు లిమిట్ లక్ష రూపాయలు అనుకుని రూ. 40 వేలను బదలాయిస్తే, మీ క్రెడిట్ లిమిట్ రూ. 60 వేలుగా వుంటుంది. అయితే, క్రెడిట్ లిమిట్ లో ‘బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్’ 80 శాతానికి మించరాదు. ఎటువంటి పరిస్థితుల్లో అనుకూలం: ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా వడ్డీ రేట్లు దిగిరాని ప్రస్తుత తరుణంలో క్రెడిట్ కార్డుపై పడుతున్న వడ్డీ కన్నా కొత్తగా వచ్చిన ఆఫర్ లో వడ్డీ తక్కువగా వుంటే ‘బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్’ ఉపయోగపడుతుంది. కొత్త కార్డుకు కొంత మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల కొన్ని వందల రూపాయల వరకూ భారం తగ్గుతుంది. బ్యాంకులు అందించే సేవల్లో అసంతృప్తి ఉన్నా, క్రెడిట్ కార్డును అంటగట్టిన కంపెనీ అందిస్తున్న సేవలు సక్రమంగా లేవని భావించినా ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. ఒక్కసారిగా కార్డు వాడకాన్ని నిలిపివేయలేనివారికీ ఈ ‘బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్’ ఉపయుక్తకరమే. నెలవారీ చెల్లింపులకు డబ్బు లేకుంటే?: క్రెడిట్ కార్డును ఎక్కువగా వాడేసి కనీస నెలసరి కిస్తీలను కూడా చెల్లించలేనంతటి కష్టాల్లో వున్నవారికి ఈ సదుపాయం తాత్కాలిక ఊరటనిస్తుంది. వీరు తమ కార్డులోని బ్యాలెన్స్ ను మరో కార్డులోకి బదలాయించుకోవడం ద్వారా కొంత వెసులుబాటు పొందవచ్చు. చార్జీల భారం భరించక తప్పదు మరి!: కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ ఉన్నప్పటికీ, ఆ సౌకర్యం నియమిత కాల వ్యవధి వరకే ఉంటుంది. కొంత కాలం వరకూ సున్నా శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నప్పటికీ, ఆపై కనిపించని మొత్తాన్ని భారంగా మోపుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. చాలా బ్యాంకులు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ తరువాత సున్నా శాతం వడ్డీని మూడు నుంచి ఆరు నెలల పాటు దగ్గర చేస్తున్నాయి. ఆ తరువాత మాత్రం సాధారణంగా చెల్లించాల్సిన వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. మొత్తం ట్రాన్స్ ఫర్ మొత్తంలో 2 నుంచి 5 శాతం వరకూ ప్రాసెసింగ్ ఫీజు రూపంలో భ్యాంకులు వసూలు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందన్న విషయం మరువకూడదు. ‘బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్’ ఎలా: ముందుగా నిలిచిపోయిన రుణాన్ని ఏ కంపెనీ కార్డుకు బదిలీ చేయాలని భావిస్తున్నారో ఆ కార్డు ఇచ్చిన బ్యాంకుకు తెలియజేయాలి. పాత కార్డు గురించిన సమాచారాన్ని, నెలవారీ స్టేట్‌మెంట్‌ను, తాజా క్రెడిట్ కార్డు బిల్ వివరాలు అందించాలి. ఆపై కంపెనీ లేదా బ్యాంకు సంతృప్తి చెందితే వారం నుంచి పది రోజుల్లో కొత్త క్రెడిట్ కార్డు వస్తుంది. పాత క్రెడిట్ కార్డు జారీ చేసిన కంపెనీ పేరిట ఓ డి.డిని కొత్తగా కార్డును పొందుతున్న సంస్థ అందిస్తుంది. సులభంగా ఈ ఉచ్చు నుంచి బయటపడాలంటే: ఆకర్షణీయంగా కనిపించే ఈ ఉచ్చు నుంచి బయట పడాలంటే, తక్కువ వడ్డీ కొనసాగుతున్న సమయంలో సాధ్యమైనంత ఎక్కువ చెల్లింపులు జరపాలి. అప్పుడే కార్డును మార్చుకున్నందుకు లాభం కలుగుతుంది. అంతకుమించి వడ్డీ భారం నుంచి తాత్కాలిక రిలీఫ్ కూడా లభిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే, కొత్త కార్డు తీసుకున్న తరువాత దాన్ని వినియోగించి కొనుగోళ్లు జరిపితే సున్నా శాతం లేదా తక్కువ వడ్డీ సదుపాయాలు లభించవు సుమా!