: షార్ట్స్ వేసుకు తిరిగే అమ్మాయిలను కోతులతో పోల్చిన టీవీ చానల్!
షార్ట్స్ వేసుకుని వీధుల్లో సంచరించే యువతులను కోతులతో పోలుస్తూ, అసోంకు చెందిన 'ప్రతిదిన్ టైం' టీవీ ఛానల్ ప్రసారం చేసిన కథనం విమర్శలకు దారి తీసింది. ఈ కథనంపై ఈశాన్య రాష్ట్రాలలోని ప్రజలు భగ్గుమంటున్నారు. పోలీసుల కంటే మీడియాను చూసి భయపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కోతులు బట్టలు ధరించడం మొదలు పెట్టాయి. వాటికి బట్టలు ఎలా ఉతుక్కోవాలో తెలుసు. కానీ, గౌహతిలోని అమ్మాయిలు మాత్రం తమ సౌకర్యం కోసం షార్ట్స్ ఎంచుకుంటున్నారు" అని ఆ టీవీ ఛానల్ కార్యక్రమంలో వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కార్యక్రమంలో షార్ట్స్, టీ షర్ట్స్ ధరించి నగరంలో తిరుగుతున్న యువతులను వెనుకవైపు నుంచి చూపించారు కూడా. దీనికి నిరసనగా గౌహతి నగరంలో ఆందోళనలు జరిగాయి. టీవీ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ నితుమోని సైకియా ఫేస్ బుక్ మాధ్యమంగా క్షమాపణలు చెప్పినా గొడవ సద్దుమణగలేదు. తమ కార్యక్రమం ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెబుతున్నామని, దీనిపై జరుగుతున్న రగడను ఇంతటితో ఆపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటువంటి తప్పు మరోసారి చేయవద్దని ఆ రిపోర్టరును హెచ్చరించినట్టు సైకియా తెలిపారు.