: ‘టాటా’ డ్రైవర్ గా కేశినేని నాని!...ఎయిర్ పోర్టు నుంచి నాని కారులో బెజవాడకు రతన్ టాటా
టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు విజయవాడ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని డ్రైవర్ గా వ్యవహరించారు. ఈ ఆసక్తికర ఘటన నిన్నటి రతన్ టాటా విజయవాడ పర్యటన సందర్భంగా కనిపించింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 264 గ్రామాలను దత్తత తీసుకునేందుకు నిన్న రతన్ టాటా సొంత విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. రతన్ టాటాకు విమానాశ్రయంలో విజయవాడ ఎంపీ హోదాలో కేశినేని నాని ఘన స్వాగతం పలికారు. అనంతరం తన సొంత కారులో రతన్ టాటాను కూర్చోబెట్టుకుని కారును తానే డ్రైవ్ చేసుకుంటూ కేశినేని నాని విజయవాడకు తీసుకొచ్చారు. ఈ దృశ్యం విజయవాడ వాసులకు కనువిందు చేసింది. విజయవాడ లోక్ సభ పరిధిలోని అన్ని గ్రామాలను రతన్ టాటా దత్తత తీసుకోవడంలో కేశినేని నాని కీలక భూమిక పోషించారు. తన ప్రతిపాదనను మన్నించిన రతన్ టాటాను గౌరవిస్తూ నాని తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారు.