: చిన్న లడ్డూలు చేస్తారట... 100 గ్రాములకు తగ్గనున్న శ్రీవారి ప్రసాదం బరువు!
మరింత మందికి తిరుమల శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం అందించాలన్న లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ప్రస్తుతం 175 గ్రాముల బరువున్న లడ్డూల స్థానంలో 100 గ్రాముల బరువుండే లడ్డూలను తయారు చేయించాలని ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 175 గ్రాముల బరువు కలిగివుండే లడ్డూను రూ. 25కు విక్రయిస్తున్నామని గుర్తు చేసిన ఆయన, 100 గ్రాముల లడ్డూలను రూ. 15కు విక్రయించాలని భావిస్తున్నామని, నాణ్యత పెంచి దాన్నే రూ. 20కి విక్రయించినా, కొనుగోళ్లు తగ్గవని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోజుకు 3.60 లక్షల లడ్డూలను తయారు చేస్తుండగా, ఇవి సరిపోవడం లేదని, అందువల్లే భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు బరువు తగ్గింపు దిశగా యోచిస్తున్నామని వివరించారు.