: జనం ప్రాణాలు హరిస్తోన్న అగ్రిగోల్డ్... కృష్ణా నదిలో దూకి దంపతుల ఆత్మహత్య
మాయమాటలతో జనం సొమ్మును దోచేసిన అగ్రిగోల్డ్, వారి ప్రాణాలను కూడా హరిస్తోంది. అగ్రిగోల్డ్ నిర్వాహకులు చేసిన భారీ మోసంతో నిండా ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయిన ఓ జంట కొద్దిసేపటి క్రితం కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను విజయవాడకు చెందిన వెంకటనారాయణ శర్మ, సుందరిగా గుర్తించారు. అగ్రిగోల్డ్ అరచేతిలో వైకుంఠం చూపడంతో శర్మ, సుందరి దంపతులు ఆ సంస్థలో రూ.6 లక్షల మేర డిపాజిట్ చేశారు. ప్రస్తుతం ఈ దంపతుల కుమారుడు కేన్సర్ బారిన పడ్డాడు. ఉన్నదంతా అగ్రిగోల్డ్ వద్ద డిపాజిట్ చేసిన ఈ దంపతులు, ఆ సంస్థ మోసం చేయడంతో కుమారుడికి చికిత్స చేయించలేని దుస్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన శర్మ, సుందరిలు విజయవాడలోని భవానిపురం వద్ద కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.