: ఢిల్లీలో చంద్రబాబు షెడ్యూల్ బిజీబిజీనే...ప్రధాని సహా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎక్కడికెళ్లినా క్షణం తీరిక లేని బిజీ షెడ్యూల్ తో దూసుకెళుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల సాధన కోసం సర్వసన్నద్ధంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కొద్దిసేపట్లో (ఉదయం 10.30 గంటలకు) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా భేటీ కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు మరింత బిజీగా గడపనున్నారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్న చంద్రబాబు ఆ తర్వాత 2 గంటల సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తో సమావేశమవుతారు. తదనంతరం సాయంత్రం 4 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ అరవింద్ పనగారియాతో భేటీ కానున్నారు. ఇక కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తోనూ ఆయన సమావేశం కానున్నారు. దీంతో నేటి ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి దాకా చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడపనున్నారు.