: ఎగిరే శవపేటికలు ఇవి... ఎంత మాత్రం క్షేమకరం కాదు!
భారత్ లో యుద్ధ విమానాలు నేలకూలడం కొత్తేమీ కాదు. కాలం చెల్లిన విమానాలు, పాతబడిపోయిన సాంకేతిక పరిజ్ఞానం పైలట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముఖ్యంగా, మిగ్-21 బైసన్ ఫైటర్ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ భారత వాయుసేనను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కూలిన యుద్ధ విమానం వాయుసేన దుస్థితికి అద్దం పడుతోంది. వీటి ట్రాక్ రికార్డు పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థమవుతుంది. 1970 నుంచి చోటుచేసుకున్న మిగ్-21 ప్రమాద ఘటనల్లో 170 మందికిపైగా వాయుసేన పైలట్లు దుర్మరణం పాలయ్యారు. అందుకే ఈ విమానాలను 'ఎగిరే శవపేటికలు'గా అభివర్ణిస్తారు. గడచిన ఐదేళ్లలో కనీసం 6 మిగ్-21 బైసన్ విమానాలు నేలకూలినట్టు ఓ వైమానిక రంగ నిపుణుడు సేకరించిన సమాచారం ద్వారా వెల్లడైంది. రష్యా తయారీ విమానాలైన మిగ్-21లను 1965లో భారత్-పాక్ యుద్ధ సమయంలో భారత వాయుసేనలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాలంలో మిగ్-21లను ఆధునికీకరించి మిగ్-21 బైసన్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద 6 బైసన్ స్క్వాడ్రన్లున్నాయి. మున్ముందు అన్ని రకాల మిగ్-21 విమానాల స్థానాన్ని దేశీయ తయారీ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ సీఏ), మీడియం మల్టీరోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎంఎంఆర్సీఏ) లతో భర్తీ చేయాలని వాయుసేన ప్రణాళికలు రచిస్తోంది.