: వీడ్కోలు పలికిన సంగాకు సచిన్, సన్నీ స్వాగతం పలికారు!


శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో సందేశాలు వెల్లువెత్తున్నాయి. కాగా, క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన సంగక్కరకు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ స్వాగతం పలికారు. "మహోన్నత క్రీడాకారుడా... మాజీ క్రికెటర్ల క్లబ్ లోకి స్వాగతం" అంటూ స్పందించారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ కూడా మధురంగా సాగిపోవాలని ఆశిస్తున్నట్టు సన్నీ పేర్కొన్నారు. సంగా వీడ్కోలు సమయంలో ఈ భారత క్రికెట్ దిగ్గజం కొలంబో సారా మైదానంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా సంగాకు ఓ సందేశాన్ని కవర్ లో ఉంచి అందించారు. "లంక క్రికెట్ డ్రెస్సింగ్ రూంలో పెద్దన్నలా మెలిగావు. బంతి నీ బ్యాట్ కు తగిలి, అది బౌండరీ దిశగా వెళుతున్నప్పుడు వచ్చే సౌండ్ ను ఏ క్రికెట్ ప్రేమికుడూ, ఎప్పటికీ మర్చిపోలేడు" అని తన సందేశంలో పేర్కొన్నారు. అంతకుముందు సచిన్ కూడా ఓ ట్వీట్ ద్వారా సంగక్కరకు వెల్ కమ్ చెప్పారు. "బాగా ఆడావు. ఆటకు నికార్సైన ప్రతినిధివి నువ్వు. అంతేగాదు, సిసలైన జెంటిల్మన్ గా నిలిచావు. రిటైర్డ్ ఆటగాళ్ల క్లబ్ లోకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News