: మా వద్దా ఉన్నాయి అణ్వస్త్రాలు... స్వీయరక్షణ తెలుసు: పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం వాడీవేడి వాతావరణం నెలకొని ఉంది. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమావేశాన్ని రద్దు చేసిన పాక్ ఇప్పుడు భారత్ పై కారాలుమిరియాలు నూరుతోంది. ఆ సమావేశానికి పొడిగింపుగా కాశ్మీర్ వేర్పాటువాద నాయకులతో భేటీ అజెండాను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం పాక్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో, పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ఎప్పట్లానే భారత్ పై నిప్పులు కక్కారు. మోదీ నాయకత్వంలోని భారత్ తానో ప్రాంతీయ సూపర్ పవర్ నని భావిస్తోందని విమర్శించారు. పాక్ కూడా అణ్వస్త్ర దేశమేనని, తనను తాను రక్షించుకోవడం ఎలాగో పాక్ కు తెలుసని అన్నారు. భారత నిఘా సంస్థ 'రా' పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ, భారత్ తమపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న భారత్ అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. అలా చేయకుండా తమపై బురద జల్లేందుకే భారత్ ప్రాధాన్యమిస్తోందని అన్నారు. కాశ్మీర్ అంశం భారత్ కు సమస్యాత్మకం కాకపోతే, కాశ్మీర్లో 7 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎందుకు మోహరించినట్టు? అని ప్రశ్నించారు. కాశ్మీర్లో భారత్ రిఫరెండం నిర్వహించాలని, తద్వారా ప్రజలే తమ తలరాతను నిర్ణయించుకుంటారని అజీజ్ పేర్కొన్నారు.