: ప్రొ కబడ్డీ విజేత యూ ముంబా... మూడో స్థానంతో సరిపెట్టుకున్న తెలుగు టైటాన్స్
గ్రామీణ క్రీడతో దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ రెండో సీజన్ నిన్న రాత్రి ముగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో నెలకు పైగా జరిగిన కబడ్డీ మ్యాచ్ లకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. ఆయా ప్రాంతాల్లోని లోకల్ చానెళ్లలో మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేసిన టోర్నీ నిర్వాహకులు ఆయా ప్రాంతీయ భాషల్లోనూ కామెంటరీ ఇప్పించి టోర్నీని విజయవంతం చేశారు. నిన్న రాత్రి ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ ను చిత్తు చేసిన యూ ముంబా విజేతగా నిలిచింది. ఇక ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. సెమీస్ లో ఒకే ఒక్క పాయింట్ తేడాతో విజయాన్ని చేజార్చుకున్న తెలుగు టైటాన్స్ నిన్న మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ ను చిత్తు చేసింది. టోర్నీ విజేతగా నిలిచిన యూ ముంబాకు రూ.కోటి ఫ్రైజ్ మనీ లభించగా, రన్నరప్ బెంగళూరు బుల్స్ కు రూ. 50 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ కు రూ.30 లక్షలు, నాలుగో స్థానంలో నిలిచిన పాట్నా పైరేట్స్ కు రూ.20 లక్షలు దక్కాయి.