: ప్రమాద స్థలిలో ‘అనంత’ కలెక్టర్, ఎస్పీలు...సహాయక చర్యలపై స్వయంగా పర్యవేక్షణ
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. ప్రమాదం చోటుచేసుకున్న మరుక్షణమే అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని కలెక్టర్, ఎస్పీలిద్దరూ దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు. ఇక చంద్రబాబు ఫోన్ చేసిన సమయంలో ప్రమాద స్థలిలోనే ఉన్న కలెక్టర్ శశిధర్, ప్రమాదానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేశారు. ప్రమాదం నేపథ్యంలో మార్గమధ్యలోనే చిక్కుబడిపోయిన ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు తరలించే విషయంపై దృష్టి సారించిన కలెక్టర్, జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల నుంచి బస్సులను తెప్పించారు.