: ఇక దేశమంతా ‘తెలుగు దేశం’... టీడీపీ పేరిటే విస్తరించనున్న సైకిల్ పార్టీ!
దివంగత నందమూరి తారకరామారావు చేతుల మీదుగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇప్పుడు నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా దేశవ్యాప్తంగా విస్తరించనుంది. పార్టీ పేరును కాని, సైకిల్ గుర్తును కాని మార్చకుండానే దేశవ్యాప్తంగా విస్తరించాలని నిన్న విజయవాడలో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన పార్టీ పేరును ఎంతమాత్రం మార్చాల్సిన అవసరం లేదని కూడా పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ‘పార్టీ పేరూ మారదు, గుర్తూ మారదు’ అని పార్టీ అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు తదితర ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు పార్టీ ప్రవేశం చేసినా ఎంతో కొంత మేర ఓట్లను రాబట్టవచ్చని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ సైకిల్ గుర్తుపైనే పోటీ చేసిందని, దీంతో పార్టీకి ఎన్నికల సంఘం అదే గుర్తును ధ్రువీకరించినట్లైందని పార్టీ విస్తరణపై అధ్యయన కమిటీ కన్వీనర్ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించనున్న నేపథ్యంలో ఇకపై పార్టీకి కేంద్ర కమిటీతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కమిటీలు, ఓ పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. త్వరలోనే ఈ కమిటీల ఏర్పాటు పూర్తవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.