: చంద్రబాబుతో రేపు పవన్ కల్యాణ్ భేటీ?
ఏపీ రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న భూసేకరణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తన సినిమా షూటింగును రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన తన సన్నిహితులతో తాజా అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో, భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో రేపు పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో అక్కడి పరిస్థితులను రైతులను అడిగి ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. తరువాత గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన పెనుమాకలోని ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో రైతులతో సమావేశం అవుతారు. దాని తరువాత సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అయి, రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం.