: దావూద్ నివాసం కరాచీలోనే!... ఫోన్ లిఫ్ట్ చేసిన భార్య!
ముంబయి వరుస పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దావూద్ కరాచీలో నివసిస్తున్నట్టు ఓ ఫోన్ కాల్ ద్వారా వెల్లడైంది. వివరాల్లోకెళితే... ఓ జాతీయ వార్తా చానల్ రిపోర్టర్ దావూద్ ఇబ్రహీం భార్యకు ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన దావూద్ భార్య మెహజబీన్ షేక్ తన గుర్తింపును నిర్ధారించారు. తాను దావూద్ భార్యనని, కరాచీలో ఉంటున్నామని సదరు రిపోర్టర్ కు చెప్పేశారు. దావూద్ తో మాట్లాడాలని రిపోర్టర్ కోరగా, ఆయన నిద్రపోతున్నారని మెహజబీన్ బదులిచ్చారు. ఆపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆ రిపోర్టర్ యత్నించగా, దావూద్ భార్య ఫోన్ కట్ చేశారు. ఇప్పటిదాకా దావూద్ అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ వివరాలతో తెరపడే అవకాశముంది.