: ప్రభుత్వోద్యోగిపై దాడి కేసులో ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే అరెస్ట్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కమాండో సురేందర్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, అతను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం, కులం పేరుతో దూషించడం వంటి నేరాల కేసులో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు తిరస్కరించడంతో వెంటనే అరెస్ట్ చేశారు. వెంటనే ఆయనను వైద్య పరీక్షల కోసం రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 4న సాధారణ తనిఖీలు చేసేందుకు వచ్చిన ఎన్డీఎంసీ అధికారుల బృందం అదే సమయంలో ఓ ఈ-రిక్షా డ్రైవర్ ను పత్రాలు ఇవ్వాలని అడిగింది. ఈ సమయంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఎమ్మెల్యే సురేందర్ వారిపై తీవ్రంగా దాడి చేసి, కొట్టినట్టు తెలిసింది. దాంతో మున్సిపల్ కౌన్సిల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఆర్.జే.మీనా ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పోలీస్ అధికారి వివరించారు. గత రెండు నెలల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అరెస్టైన వారిలో సురేందర్ మూడవవ్యక్తి.