: వర్మ అభిప్రాయంతో ఏకీభవించను: చిరు
తెలుగు సినిమా రంగంలో డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, యాక్షన్... ఇలా అన్ని రసాలను అలవోకగా పండిస్తూ మెగాస్టార్ గా అందరి అభిమానం సంపాదించుకున్న నటుడు చిరంజీవి 150వ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఆగస్టు 22న తన జన్మదినం జరుపుకోనున్న ఆయన ఓ వార్తా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంగతులు చెప్పారు. తాజా సినిమాకు ఇంకా కథ దొరకలేదని తెలిపారు. అందరినీ అలరించేలా ఈ సినిమా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని, అది కూడా సినిమా ఆలస్యానికి కారణమవుతోందని చెప్పారు. కొన్ని కథలు విన్నానని, వాటిలో పూరీ జగన్నాథ్ చెప్పిన ఆటోజానీ కథలో ప్రథమార్ధం బాగానే ఉందని, ద్వితీయార్ధమే నిరుత్సాహం కలిగించిందని వివరించారు. ఇక, రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ పై స్పందిస్తూ... "తాజా ప్రాజెక్టుకు నేనే దర్శకత్వం వహించాలని వర్మ పేర్కొన్నాడు. అతని అభిప్రాయంతో నేను ఏకీభవించను. నా గురించి నాకన్నా దర్శకులు, నిర్మాతలకే బాగా తెలుసు. నన్ను ఎలా చూపాలన్న విషయంపై వారికే మెరుగైన అవగాహన ఉంటుంది" అని అభిప్రాయపడ్డారు.