: బ్యాడ్మింటన్ లో నెంబర్ వన్ మళ్లీ సైనానే
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తిరిగి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కోల్పోయినప్పటికీ ఆమె తొలి స్థానం దక్కించుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్లుఎఫ్) ప్రకటించిన తాజా ర్యాంకుల ప్రకారం, ఛాంపియన్ షిప్ లో సైనాను ఓడించి స్వర్ణం గెలుచుకున్న కరోలినా మారిన్ (స్పెయిన్ క్రీడాకారిణి) మొదటి ర్యాంక్ చేజార్చుకుని రెండవ స్థానానికి పడిపోయింది. ఇక చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ జూ యింగ్ మూడవ స్థానం, చైనా క్రీడాకారిణి లీ జురై నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. అటు వరల్డ్ ఛాంపియన్ షిప్ లో రెండుసార్లు కాంస్య పతకం గెలుచుకున్న పీవీ సింధు 14వ స్థానానికి పడిపోయింది. పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ నాలుగవ స్థానానికి పడిపోగా, పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరుకున్నాడు.