: మరే ప్రధానికైనా ఇది సాధ్యమైందా? : మోదీపై ఖర్గే సెటైర్
లోక్ సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధానికి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు సమయం ఉండదు కానీ, విదేశాలకు వెళ్లి ఉపన్యాసాలు దంచేందుకు మాత్రం సమయం ఉంటుందని ఎత్తిపొడిచారు. మోదీ ఓ టూరిస్టు ప్రధానమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. 25 దేశాల్లో మోదీ పర్యటించిన విషయం ఎత్తిచూపుతూ, ఇకనైనా పార్లమెంటును దర్శించాలని వ్యంగ్యం ప్రదర్శించారు. "సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలోనూ ప్రధాని సభలో లేరు. తన కార్యాలయంలో ఉన్నారు. ప్రధాన సమస్యలపై సభలో చర్చిస్తున్నప్పుడు కూడా ఆయన ఉండరు. ఆయనకు సభకు వచ్చేందుకు సమయం ఉండదు, తన మంత్రివర్గ సహచరులపై వచ్చిన ఆరోపణలకు బదులిచ్చేందుకు సమయం ఉండదు. కానీ, ఆస్ట్రేలియా వెళతారు, అమెరికా వెళతారు, మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వంటి ప్రఖ్యాత స్థలాల్లో ప్రసంగిస్తారు. దుబాయ్ కూడా వెళతారు, అక్కడా వేలాదిమందిని ఉద్దేశించి గంటలకొద్దీ మాట్లాడతారు. గత ప్రభుత్వాలను ఏకిపారేస్తారు. ఆయనో టూరిస్టు ప్రధాన మంత్రి. ఏడాదీ నాలుగున్నర నెలల పాలనాకాలంలో ఆయన 25 దేశాలు సందర్శించారు. మరే ప్రధానమంత్రికైనా ఇది సాధ్యమైందా?" అని వ్యంగ్యం ప్రదర్శించారు.