: ఈ నెల 22న నిరసన దీక్ష చేపడుతున్నాం: తెలంగాణ ఎంపీటీసీల ఫోరం
టీఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో తమను భాగస్వాములు చేయకపోవడంతో తెలంగాణలోని ఎంపీటీసీలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో, తమను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న నిరసన దీక్ష చేపడుతున్నట్టు తెలంగాణ ఎంపీటీసీల ఫోరం ప్రకటించింది. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఈ దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా, ఈ రోజు నుంచి గ్రామ, మండల స్థాయి సమావేశాలను కూడా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. ఈ పథకంలో గ్రామ సర్పంచ్, వైస్ సర్పంచ్, చివరకు వార్డు మెంబర్ కు కూడా స్థానం కల్పించారని... తమను మాత్రం విస్మరించారని ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై, రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రిని పలుమార్లు కలసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, ఎలాంటి ఫలితం దక్కలేదని అన్నారు. తమను ప్రజాప్రతినిధులుగా ఈ ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు.