: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తొలి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసి ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తామని చక్రపాణి తెలిపారు. సెప్టెంబర్ 20న ఏఈఈ ఉద్యోగాలకు కామన్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆన్ లైన్ దరఖాస్తుకు రెండు వారాల సమయం ఇస్తున్నామని, ఇప్పటికే 2.68 లక్షల మంది వన్ టైం కింద రిజిస్టర్ చేసుకున్నారని ఛైర్మన్ వివరించారు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 3గా నిర్ణయించామని టీఎస్ పీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 3,783 పోస్టుల భర్తీకి ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలిపారు. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా ఉన్నాయన్నారు. ఈ ఉద్యోగాలకు బీటెక్ సివిల్ గ్రాడ్యుయేట్లు అర్హులన్నారు. మొదటి దశలో టెక్నికల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని, డిసెంబర్ లోపు అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకు సిలబస్ విడుదల చేస్తామని, ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు ఉంటాయని వివరించారు. మరో వారంలోగా అసిస్టెంట్ ఇంజినీర్ల ఉద్యోగాలకు ప్రకటన ఉంటుందని చక్రపాణి తెలిపారు. అసిస్టెంట్, సివిల్, మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అక్టోబర్ చివరి నాటికి గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే గ్రూప్-1 నిర్వహణలో కొన్ని సమస్యలున్నాయని, అక్టోబర్ నాటికి కమలనాథన్ కమిటీ నుంచి నివేదిక వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సవివరంగా తెలిపారు.