: కాల్షియం కార్బైడ్ వాడకం ఉగ్రవాదానికన్నా ప్రమాదకరం: హైకోర్ట్
వివిధ పండ్ల పక్వం కోసం కాల్షియం కార్బైడ్ వాడటంపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. సహజంగా పక్వానికి వచ్చే పండ్లకు రసాయనాలు వాడాల్సిన అవసరమేంటి? అని ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా ప్రశ్నించింది. రసాయనాలతో పక్వానికి వచ్చిన ఏ పండు ఆరోగ్యానికి సురక్షితం కాదని, నిషేధిత రసాయనాల వాడకాన్ని నిరోధించలేరా? అని తెలుగు రాష్ట్రాలను అడిగింది. స్పందించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది, రాష్ట్రంలో పలుచోట్ల పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేశామని, కాల్షియం కార్బైడ్ ఉన్నట్టు గుర్తించలేదని తెలిపారు. అయితే పండ్ల నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపామని వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 4 పండ్ల మార్కెట్లలో తనిఖీలు నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. భారీగా కాల్షియం కార్బైడ్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు ఏం చేస్తున్నారని ఇరు రాష్ట్రాలను న్యాయస్థానం ప్రశ్నించింది. పిల్లలు, పెద్దలపై కాల్షియం కార్బైడ్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేయాలని ఆదేశించింది. నిషేధిత కాల్షియం కార్బైడ్ ను ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగిన కోర్టు, దాని వాడకం ఉగ్రవాదానికన్నా ప్రమాదకరం అన్న వ్యాఖ్యానించింది. సమగ్ర నివేదికలతో ప్రమాణ ప్రతాలు దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.